రాముడు రాఘవుడు రవికులుడితడు
భుమిజకు పతియైన పురుష నిధానము
అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున
పరగ జనించిన పరబ్రహ్మము
సురల రక్షింపగ అసురుల శిక్షింపగ
తిరమై ఉదయించిన దివ్యతేజము
చింతించు యోగీంద్రుల చిత్త సరోజములలో
సంతతము నిలచిన సాకారము
వింతలుగ మునులెల్ల వెదకినయెట్టి
కాంతుల చెన్ను మీరిన కైవల్యము
వేదవేదాంతములందు విజ్ఞానశాస్త్రములందు
పాదుకొని బలికేటి పరమార్దము
పోదితో శ్రీవేంకటాద్రి పొంచి విజయనగరాన
ఆదికనదియైన అర్చావతారము